Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

ఆధునిక
మానవ సమాజములో మతము

క్రీ.శ. 1963 ఆగష్టు నెలలో మధురలో కుంభాభిషేకము జరిగినది. ఈఉత్సవమునకు ఆహ్వానింపబడి 'అమెరికన్‌ కాన్సల్‌ జనరల్‌' డాక్టరు అల్బర్టు బి. ఫ్రాంక్లిస్‌ మధుర వెళ్ళి ఆ సమయమునందే రెండవ ఆగమ శిల్ప సదస్సు జరుగుతూ ఉండగా శ్రీ కామకోటి పీఠాధిపతులను కలుసుకొని దాదాపు అర్ధఘంట సమయం సంభాషించారు. ఫ్రాంక్లిస్‌గారికి ఏబది నాలుగు ఏళ్ళుంటాయి. ఆయన హార్వర్డు విశ్వవిద్యాలయములో 'ఫిలాలజీ డాక్టరేటు' పట్టము పుచ్చుకొని అచ్చటనే కొంతకాలము ఉద్యోగము చేసి పిదప 'మేరీలాండు' విశ్వవిద్యాలయములోకూడ ఉద్యోగము చేశారు. భారతదేశమునకు వచ్చిన పిదప కుతూహలముకొలది సంస్కృతము, తమిళము, యోగశాస్త్రము చదువ నారంభించారు.య

రోజురోజుకు నాగరికత ముదిరిపోతూ పారిశ్రామిక యుగ ప్రవేశకారణముగా ప్రపంచమునందే విశ్రాంతికి విరామమునకు క్షామము దాపురిస్తూవున్న ఈ కాలములో మతవిశ్వాసములు, మతానుష్ఠానములు పరిపూర్ణముగా మాయమయ్యే అపాయము వున్నదా? అని స్వాములవారిని ఫ్రాంక్లిస్‌గారు ప్రశ్నించారు. దానికి స్వాములవారు ఇచ్చిన సమాధానము ఆశాజనకముగా వున్నందున ఆయన చాల తృప్తిచెందారు. ఫ్రాంక్లిస్‌ తాను క్రైస్తవమతానికి చెందిన వాడైనా తనకు ఇతర మతాలపై గౌరవము కలదనియు, ఇతర మతములను గూర్చి తెలుసుకొనవలెనన్న ఆసక్తి వున్నదనియు స్వాములవారితో చెప్పగా ఆయన'మతప్రవక్త లందరు లోకసౌఖ్యమే ధ్యేయముగా భావించినారనియు, అన్ని మతాలకు మూలసూత్రాలలో సామరస్యము వున్నదనియు' అన్నారు. అంతేకాక ఫ్రాంక్లిస్‌గారికి వున్న మతసహనము, ఇతర మత విషయ గ్రహణములో కల ఆసక్తి సంతోషకరములని స్వాములవారు అభినందించారు.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- రేడియోలు, విమానములు అపరిమితంగా పెరిగిపోయిన ఈ కాలములో దేశ##దేశాల మధ్య ఉన్న దూరము తరిగిపోయి ఒకరినిగూర్చి ఒకరు తెలుసుకొనుటకు అవకాశము పెరిగింది. వైజ్ఞానికముగానే కాక మతవిషయాలలో కూడా పరస్పర బోధనలకు సౌకర్యము లెక్కువగాకల ఈ కాలము మతసామరస్యానికి దారితీయగలదని మీరు అభిప్రాయపడుతూ ఉన్నారా?

స్వామి:- ఈ కాలంలో అన్నిటికంటె రాజకీయాలకే ప్రాముఖ్యం ఎక్కువ. ''మా రాజకీయ విధానమే ప్రధానమైనది. అదే గొప్పది. దానిని మించిన దేదీలేదు.'- అని వాదించుట పరిపాటి అయిపోయింది. ఉదాహరణకు- చైనా తన రాజకీయ విధానమే శ్రేష్ఠమైనదని చాటుతూ ఉన్నది. కాని మతవిషయములో అట్టి నిర్బంధాలు ఏవీ లేవు. పరిజ్ఞాన తృష్ణ కలవారు ఏ మతమునుండి యైనను ఏ విషయమైనను గ్రహింపవచ్చును. అట్టి విషయగ్రహణమును ఏ మతము నిషేధింపదు. అయితే ప్రతిమతమునందు అటువంటి యత్నాలను నిషేధించే సంకుచిత స్వభావులు ఉండనే ఉంటారు. అదేవిధముగా సౌహార్దము, హృదయవైశాల్యముకల ఉదార స్వభావులు మనము జ్ఞానమును అందరకు పంచిపెడుతూ చేతనైన సాయము చేసేవారు కూడ అన్నిమతములలోను ఉన్నారు. మీరన్నట్లు ఈ కాలంలో నాగరికతద్వారా వివిధ దేశాలు దగ్గరైనందున వివిధమత సామరస్యానికి అనుకూలతలు ఎక్కువగా అనియే చెప్పాలి.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- నాగరికత కారణంగా ఎదురు చూడని మార్పులు కలుగుతూ, జీవనవిధానములోనే ఒకక్లిష్టత ఏర్పడుతూ ఉన్నది. పైగా మానవునకు చిత్తచాంచల్యము కలిగించి, మనస్సును భ్రమింపజేసే విషయాలు, అవకాశాలు ఈ కాలంలో ఎక్కువ. హిందూమతం ఈనాటిదికాదు. కొన్నివేల ఏళ్ళనాటిది. కాని యీనాటికి కూడ ఎక్కువ మార్పులు లేక తన స్వరూపమును రక్షించుకొంటూ వస్తూ వున్నది. స్వాములవారు అమిత నిరాడంబర జీవులని, ఆహారపానీయాలలో ఎక్కువ నియమము కలవారని పాదసంచారము చేస్తున్నారని విన్నాను. ఈ నాగరిక ప్రపంచములో తారుమారైన జీవనవిధానాలలో, మనస్సుకు భ్రమ కలిగించే వాతావరణంలో హైందవమతానికి, ఆధ్యాత్మిక రక్షణకు ఏదైనా వుపాయము వున్నదంటారా? సాధారణ మానవులకు మనోనిగ్రహము యీ కాలములో సాధ్యమా?

స్వామి:- మనశ్చలనము కలిగించే విషయాలు ఈనాడేకాదు, ఎప్పుడూ వుండేవే. కాని పారమార్ధిక ప్రయోజనము కోరేవారు త్యాగముతో మనోనిగ్రహము సంపాదించేవారు. నాగరికతవలన భోగభాగ్యాలు ఎక్కువైనందు వలన మనశ్చలనము కలిగించే అవకాశాలు ఎక్కువ. కనుక యీ కాలములో మనోనిగ్రహము మరింత త్యాగము చేస్తేకాని సాధ్యముకాదు.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- భారతదేశము పారిశ్రామికముగా ముందంజవేస్తూ పురోగమిస్తున్నది. అందుచేత దేశంలో సమృద్ధి ఏర్పడి తత్కారణముగా మతవ్యాప్తికి, ఆధ్యాత్మికాభి వృద్ధికి భంగము లేకుండ వుండుటకు మతం ఏవైనా మార్పలు అవసరమా?

స్వామి:- దేశములో సాధువులు, మహాత్ములు పారమార్థికాభివృద్ధికి తోడ్పడుతూ వుంటారు. అట్టి పవిత్ర జీవులు తమ సమక్షము చేతనే ప్రపంచములో పరివర్తన తీసుకొనిరాగలరు. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల హృదయాలలో సైతము గౌరవమును భక్తిని నాటగల తపోధనులు దేశంలో వుంటే మతవిచ్ఛిత్తి ఎన్నటికీ కలుగదు. నాగరికతాకారణంగా పల్లెలు, పట్టణాలు మారవచ్చు. జీవన విధానాలుమారవచ్చు. కాని ప్రజలలోవున్న పరమార్థవస్తువులో మార్పవుండదు. ఒక వేళ మతానుష్ఠానాలలో కొంచెము మార్పు కలుగవచ్చునేమో కాని మతం బోధించే మూలసిద్ధాంతాలలో ఏవిధమైన మార్పు వుండదు. ఈ విషయము ఒక్క హిందూమతానికే కాదు, అన్ని మతాలకూ అనువర్తిస్తుంది.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- హిందువులు, హిందూమతము ఒకప్పుడు అనన్యసౌభాగ్యముతో వర్థిల్లి కల్క్యవతారము సమీపించుటతో మనుష్యునిలో పరిక్షీణత ప్రారంభ##మై, మానసిక దౌర్భాగ్యముతో బాటు, ఆకారనష్టికూడ ప్రాపించబోతూ వున్నదని అంటారుకదా! కల్క్యవతారకాలము సమీపించినదని మీరు అంటారా?

స్వామి:- ఈ మధ్య శతాబ్దములలో కూడ మతవిషయిక చైతన్యము క్షీణించినపుడు మహాత్ములు పుట్టి మరల మతము చైతన్యవంత మగుటకు కారకులయ్యారు. అంటే ధర్మానికిగ్లానియేర్పడినప్పుడు మహాత్ములు పుట్టుటసహజము. ఇక రాబోయే కాలములో కూడ అటువంటి మహాత్ములు పుట్టవచ్చు. ఇతరయుగాలలో ఎంతయో తపస్సు చేస్తేకాని సాక్షాత్కారమయ్యేదికాదు. కాని ఈకాలములో కొంచెము నామజపము చేసినప్పటికిని చాలు భగవంతునిపై తీవ్రమైన ప్రేమ, తీవ్రమైన భగవత్సంయోగాకాంక్ష సాక్షాత్కారము సంపాదించి పెడతాయి. భగవత్ర్పేమయొక్క విశిష్టతను బోధించినవారిలో శ్రీకృష్ణచైతన్యులు ప్రధానులు. యీవిధముగా అప్పుడప్పుడు మహాత్ములు వుద్భవిస్తూ వుంటారు. అందువలన మతం క్షీణిస్తుందని మనము భయపడనక్కరలేదు. ఎక్కడైన అట్లు క్షీణించినా ఇంకొకచోట వృద్ధి అవుతుంది. ఒక దేశములో సముద్రము హఠాత్తుగా వెనుకకు వెడితే ఇంకొక దేశములో సముద్రము ముందుకు వస్తుంది. మతవిషయము కూడ అంతే.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- మిమ్ములను కలుసుకొన్నందుకు మీ ఆశీస్సుల నందుకొన్నందుకు చాల సంతోషము. మరొక మారు మిమ్ములను దర్శిస్తాను.

శ్రీస్వాములవారు:- భావశుద్ధికలవారు చాలఅరుదుగా ఉంటారు. అటువంటివారిని కొందరను నేను చూచాను. వారిలో మీరు ఒకరు. (వారి సంభాషణ ఆనా డట్లు ముగిసినది.)

కుంభాభిషేకమును గురించి, స్వాములవారిని గురించి డాక్టరు ఫ్రాంక్లిన్‌ 'స్పాన్‌' అనే పత్రికలో యీవిధముగా వ్రాశారు.

''మీనాక్షీదేవి గోపురవిమానము చూస్తూ మేమంతా ఆలయప్రాంగణములో నిలచి వుండగా ఆ జనసందోహమునకు మధ్య ఒక కలకలము బయలుదేరింది. ఆహూతులైన పెద్ద మనుష్యులందరు ఒకప్రక్కకు గౌరవముగా జరిగి త్రోవ ఈయగా దండము ధరించి ఒక సంన్యాసి ముందుకు వచ్చి విమానము మీదకు వెళ్లుటకై వేసిన నిచ్చెననుసమీపించారు. అటు, ఇటు చూస్తూ ప్రతి చిన్నవిషయమును శ్రద్ధగా ఆయన గమనిస్తున్నారు. ఈ వయోధికుడైన వ్యక్తి ఎవరు? ఆయన కొక పేరు- ఊరు వుండవచ్చు. 'ఆయన వయస్సు ఇంత' అని మనము బహుశః లెక్కకట్టవచ్చును. కాని ఆయన అందరయొక్క సమిష్టిరూపంగా కనబడుతున్నారు. ఇక ఆయన వయస్సు మనుష్యు డేనాటినుండి భావనాకాశములో విహరించుట కారంభించాడో ఆనాటినుండి గణించాలి అనిపిస్తుంది. తన విశ్వాసముకొఱకై అన్నిటిని త్యాగముచేసిన త్యాగధను డాయన. అన్నిమతములకు త్యాగమేకదా హృదయము. ఆయన ఆ నిచ్చెనను సమీపించి వయస్సుకు మించిన జవసత్త్వాలతో ఏడెనిమిదిమెట్లు గబగబ ఎక్కినారు. ఈకుంభాభిషేక మహోత్సవము పూర్తి అయ్యేవరకు అందరను ఆకం్షించిన ప్రధానవ్యక్తి ఆయనయే.

శ్రీస్వాములవారు మైలాపూరులో ఉన్నప్పుడు ఫ్రాంక్లిను మరొకమారు ఆయనను దర్శించారు. ''అప్పు డాయనమాటల సందర్భములో స్వాములవారితో - మీ ఆయురారోగ్యముల అభివృద్ధికై భగవంతుని ప్రార్థిస్తున్నాను''- అన్నారు. అప్పుడు స్వాములవారు- మీరు చూపుతూ ఉన్న భక్తిప్రపత్తులు వ్యక్తిగతముగా (నాకు) కాక వేయేండ్లుగా వస్తూ ఉన్న భారతదేశపు పారమార్థికసంస్థకు అనగా సంన్యాసాశ్రమానికి చెందుతాయి''- అని బదులు చెప్పారు. ''ప్రపంచములో సుఖశాంతులు నెలకొనుటకై అట్టి సంస్థలు ఎంతో అవసరము కదా!''- అని ఫ్రాంక్లిను మరల స్వాములవారియెడ తమ గౌరవాన్ని వెలిబుచ్చారు. మధురలో ఆయనను దర్శించిన విషయము స్మృతికి వచ్చినప్పుడు తనకు తెలియని సుఖానుభూతి యేదో ఒకటి కలుగుతూ ఉన్నదని ఫ్రాంక్లిను స్వాముల వారితో అన్నారు. ఆ తరువాత స్వాములవారికి ఆయనకు ఈ విధముగా సంభాషణ జరిగింది.

6-13)

ఫ్రాంక్లిను :- ''చెన్నపురిలో కొంతకాలము ఉండి ఆ తరువాత మామూలుగా మీ పాదయాత్ర ప్రారంభిస్తారను కొంటాను.''

స్వామి:- ఔను! సాధ్యమైనంతవరకు కాలినడకనే పోవాలనుకొంటున్నాను. ఈ నడకవలన ఆరోగ్యము కూడ బాగా ఉన్నదికదా!

ఫ్రాంక్లిన్‌ :- మీ పాదయాత్రలలో కలుసుకొనాలని నాకున్ను కుతుహలముగా ఉన్నది.

స్వామి :- దానికేమి! నేను బయలుదేరేవేళ మీకు కబురు పంపుతాను.

ఇలా ఫ్రాంక్లినుగారితో స్వాములవారు ఇష్టాగోష్టి చేస్తూ హిందువుల పండుగలను వ్రతాలను విశదీకరిస్తూ ఇలా అన్నారు.

''చైత్రమాసములో శుద్ధపాడ్యమి నుండి నవమివరకు ఉన్న దినాలను ''వసంత నవరాత్రులని''వ్యవహరిస్తారు. యక్షస్వరూపములో ప్రకాశరూపిణియై దేవతలకు జ్ఞానోపదేశము చేసిన ఉమాదేవి జ్ఞాపకార్థం ఈఉత్సవములను చేస్తూ ఉంటారు. మే మీ వసంత నవరాత్రులు ఒకేచోట ఉండి చేయాలి. అందుచేత విశాలముగా ఉన్నదని ఈ సంస్కృత కళాశాలకు వచ్చి చేరాము. ఈ వసంత నవరాత్రులలోనే 'శ్రీరామనవమి' ఉత్సవాలు రామావతారమును పురస్కరించుకొని చేస్తూ వుంటారు. రామావతారము, మరియు జ్ఞానరూపిణి ఉమాదేవి దేవతలను అనుగ్రహించుట- ఈ రెండు నవమినాడే జరిగినవి. వసంతర్తువులో చైత్రమాసములో వచ్చే వసంత నవరాత్రములవలెనే శరదృతువులో ఆశ్వయుజమాసములో ఆరునెలల తరువాత శరన్నవరాత్రములు వస్తాయి. అవి దుర్గాదేవి యొక్క అవతారమును పురస్కరించుకొని చేయబడతాయి. శ్రీకృష్ణుని జననం శ్రావణ బహుళ అష్టమినాడు జరిగింది. ఆనాడే గోకులంలో యోగమాయ లేక దుర్గాదేవి అవతరించింది. యోగమాయను కృష్ణుని స్థానములో ఉంచి కృష్ణుని వ్రేపల్లెకు తీసుకొని వచ్చుట, కంసుడు యోగమాయను చంపబోగా ఆమె అతని చేతులనుండి తప్పించుకొని దుర్గగామారి, అదృశ్యమగుట కూడ కృష్ణాష్టమినాడే జరిగినవి.

సంవత్సరాన్ని సరిగా రెండు భాగాలుగా చేస్తే పూర్వార్థములో శివునకు ప్రియమైన శివరాత్రి, ఉత్తరార్థములో మహావిష్ణువునకు ప్రీతికరమైన కృష్ణజయన్తి వస్తున్నాయి. రెంటికి మధ్యదూరము సరళ రేఖవలె 180 డిగ్రీలు. ఈ విధంగానే ఆద్యంతాలులేని వర్తులరూపములో ఉన్న శివలింగమును పూజించుట అన్నది ఆద్యంతాలులేని నిరాకార పరబ్రహ్మకు ఒక స్వరూపముకల్పించి ప్రపంచములో దర్శించుటయే అయి ఉన్నది. సృష్టి నిమిత్తమై నిరాకారపరబ్రహ్మ ప్రకృతిపురుషరూపాలను ధరిస్తూ ఉన్నాడు. ఈ పరమ పురుషునే బ్రహ్మమని వ్యవహరిస్తున్నారు. ప్రకృతిని స్త్రీరూపములలో శక్తి అని వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యావహారిక పరిభాషలో విద్యుచ్ఛక్తిని 'పోజిటివ్‌' 'నెగిటివ్‌' లుగా విభజించినట్లే పరబ్రహ్మను కూడ ప్రకృతి పురుషులుగా విభజిస్తున్నాము. ఈవిభాగము ఉంటేనే కార్యము. లేకపోతే కార్యము లేదు.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page